సిద్దిపేట సభలో అభివృద్ధి కంటే తిట్లకే రేవంత్ ప్రాధాన్యం : హరీశ్ రావు

సిద్దిపేట సభలో అభివృద్ధి కంటే తిట్లకే రేవంత్ ప్రాధాన్యం : హరీశ్ రావు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 20 :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా అబద్ధాలు, వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

పోతిరెడ్డిపాడు, బనకచర్ల, నాగార్జునసాగర్ కుడివైపు టన్నెల్ అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ జలహక్కులకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 299:512 వాటాల విషయంలో బీఆర్ఎస్ సంతకం చేసిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

 

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, దేవాదుల, కల్వకుర్తి, పాలమూరు తదితర ప్రాజెక్టుల ద్వారా నీటిని సక్రమంగా ఎత్తిపోసి ఉంటే రైతులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. ప్రాజెక్టుల ద్వారా ఎత్తిన నీరు, వినియోగించిన నీటిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు.

 

సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి పనులు, నిధుల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.

 

ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.