అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు

అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు

 

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 20 :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని మొహమ్మదాపూర్ గ్రామంలో అనభేరి ప్రభాకర్ రావు (తెలంగాణ భగత్ సింగ్) స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవ, కృషితో ఈ నిధులు మంజూరు కావడం హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు మరో కీలక ముందడుగు.

 

తెలంగాణ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన అనభేరి ప్రభాకర్ రావు స్మారక ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేసి, భావితరాలకు చరిత్ర, స్ఫూర్తి, వారసత్వాన్ని అందించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.

 

మొహమ్మదాపూర్ గ్రామంలోని మైసమ్మ ఆలయానికి దసరా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లోని స్మారక పార్క్, హాల్ దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో వాటిని పునరుద్ధరించి, పర్యాటకులకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లతో అంచనాలు రూపొందించారు.

 

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, అనభేరి ప్రభాకర్ రావు (తెలంగాణ భగత్ సింగ్) స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2,30,00,000 (రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు) పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ 19.11.2026 తేదీన G.O.Rt.No.348 జారీ చేసింది.

 

ఈ నిధులతో స్మారక పార్క్, హాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పన తదితర పనులు చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్మారక ప్రదేశం మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు, హుస్నాబాద్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి, స్థానిక ప్రాంత ప్రాధాన్యత పెంపునకు దోహదపడనున్నాయి.

 

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు చారిత్రక ప్రదేశాల పరిరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్న కృషిలో భాగంగా ఈ నిధుల మంజూరు లభించింది. అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల స్థానిక ప్రజలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.