హరీశ్ రావు సీఎం ఆరోపణలకు సమాధానం చెప్పాలి: బల్మూర్ వెంకట్

హరీశ్ రావు సీఎం ఆరోపణలకు సమాధానం చెప్పాలి: బల్మూర్ వెంకట్

 

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 20 :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ సవాల్ విసిరారు. సిద్దిపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా ఆరోపణలపై నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

 

ఉద్యమ సమయంలో ఆంధ్రా వారిని వ్యతిరేకించిన హరీశ్ రావు, ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వారితో వ్యాపారాలు చేస్తున్నారని, ఆంధ్రా విద్యాసంస్థలను వెళ్లగొడతామని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అన్నారు. అలాగే బీజేపీ నేతలతో హరీశ్ రావు రహస్య చర్చలు, ఒప్పందాలు జరిపారంటూ విమర్శించారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.

 

సిద్దిపేటలో సుమారు రూ.500 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినా, స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పకపోవడం హరీశ్ రావు వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

 

తన కుటుంబం ప్రమాదానికి గురైన సమయంలో బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించడం కేటీఆర్ నీచమైన సంస్కృతికి నిదర్శనమని బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. ప్రమాదంపై బాధపడాల్సింది పోయి, ప్రమాదం మంచిదేనంటూ పోస్టులు పెట్టించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంతో పాటు, వారి చీకటి వ్యవహారాలను ప్రజల ముందు బయటపెడతానని హెచ్చరించారు.