కొండగట్టు అంజన్నను దర్శించుకున్న స్పీకర్, మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యేలు
కొండగట్టు, వెలుతురు, నవంబర్ 20 : ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని కొండగట్టులోని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని స్పీకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్పీకర్ తో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ కి పపూర్ణకుంభంత స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రపంచానికి సవాలుగా మారిన ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి అందించాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు స్పీకర్ తెలిపారు. 60 ఏళ్లకు ఒకసారి జరిగే చందనోత్సవంలో పాల్గొనడం అదృష్టమని స్పీకర్ అన్నారు. ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండంత ధైర్యాన్ని ఆంజనేయ స్వామి ప్రసాదించాలని కోరుకున్నట్లు స్పీకర్ తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వస్తున్న కరువును గుర్తించిన ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా స్పీకర్ కోరారు. కొండగట్టు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు సాధిస్తామని స్పీకర్ తెలిపారు.
నిజరూప దర్శనం అదృష్టం :
మంత్రి లక్ష్మణ్ కుమార్
కొండగట్టులో స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి చందనోత్సవంలో పాల్గొనడం, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం గత జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ ఆలయాల విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర నుండి భద్రాచలం వరకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ సహకారంతో కొండగట్టు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని మంత్రి గారు తెలిపారు.
