విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
– క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జహీరాబాద్ వెలుతురు నవంబర్ 21:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో మండల న్యాయ సేవల కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల న్యాయ సేవల కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. కవితాదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను గౌరవించాలని సూచించారు. విద్యతోపాటు సాధారణ చట్టాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా లేదా దురుసుగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించి, ఆత్మరక్షణ, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులని, వారిని గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఉపాధ్యాయుల సహకారంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
