వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

వికారాబాద్, వెలుతురు, నవంబర్ 22 : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి వెళ్తున్న ఆటోను బుగ్గ రామేశ్వరం ఆలయం సమీపంలోని మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి

వికారాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానిక పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను, వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.