ఐకమత్యంతోనే కాంగ్రెస్కు విజయాలు : బీఎం సందీప్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 :
కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతో పనిచేయడం వల్లే తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగామని, ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో మరింత మెజారిటీతో విజయాలు సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బీఎం సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడంతో 64 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ విజయాలు సాధించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రాష్ట్రంలో వాటిని అధిగమిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తగిన సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి ఆశించిన మద్దతు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తోందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని సందీప్ కుమార్ అన్నారు. గతంలో రాష్ట్రంలో పార్టీ ఇన్చార్జులుగా పనిచేసిన ఏఐసీసీ నేతలు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వారి కృషిని కొనసాగిస్తూ, మరింత ఉత్సాహంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో అధిక స్థానాలు, భారీ మెజారిటీ సాధించాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కష్టపడాలని సూచించారు. సోనియాగాంధీ రచించిన ‘బిలాంగింగ్’ పుస్తకానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
