ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాల్లో విషాదం
కచ్, వెలుతురు, నవంబర్ 22 : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భుజ్-ఖవ్డా జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా భుజ్‌లో పనిచేస్తున్న సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కచ్ పశ్చిమ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి కథనం ప్రకారం.. బాధితులంతా ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతానికి చెందినవారు. వీరు రాన్ ఆఫ్ కచ్ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి తిరిగి భుజ్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో మూడు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేసింది.
ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమై, వాహనంలో ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీయడానికి సహాయక సిబ్బందికి గంటల సమయం పట్టింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వికాస్ సుంద ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతులను రింకీ నితిన్ గుసైన్ (35), ఆమె కుమార్తె వామిక (4 నెలలు), సౌరభ్ సింగ్ నేగి (30), ఆయన భార్య సవిత (30), వారి కుమార్తె శివిక (3 నెలలు), రాజేష్ రావత్ (35), ఆయన కుమార్తె రక్షిత (7)గా గుర్తించారు.
