శబరిమల దర్శన టికెట్లపై కొత్త నిబంధనలు
తిరువనంతపురం, వెలుతురు, నవంబర్ 22 : శబరిమల అయ్యప్ప దర్శన వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో కఠిన నిబంధనలు రానున్నాయి. వాటిని అమలు చేసేందుకు పోలీసులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిద్ధమవుతున్నాయి. బుక్ చేసుకున్న తేదీన దర్శనానికి వెళ్లని భక్తులు, తమ టికెట్‌ను రద్దు చేసుకోవడం లేదా రీషెడ్యూల్ చేయకపోతే మండల సీజన్లో మరోసారి బుకింగ్ చేసుకునే అవకాశం కోల్పోవచ్చు. అయితే అనివార్య కారణాలతో దర్శనానికి వెళ్లలేని వారు ముందుగానే తమ బుకింగ్‌ను రద్దు చేసుకోవడానికి లేదా మరో తేదీకి మార్చుకోవడానికి అవకాశం కల్పించనున్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు భక్తుల గుర్తింపు పత్రాలను సేకరించి, పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత వాటిని భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో భక్తుల ఆధార్ నంబర్ నమోదు చేయడంతో పాటు, దానికి అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి భక్తుడికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించి, పంపా లేదా నిలక్కల్ వద్ద తనిఖీ చేసే విధానాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
