మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ హతం
జమ్మూకశ్మీర్, వెలుతురు, నవంబర్ 18 :
జమ్మూకశ్మీర్‌లో చిట్టచివరి స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబ కమాండర్ లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పుల ఘటన తర్వాత అతడి కోసం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో అతడు మసీదులోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. మసీదుకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి అమిత్ షా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్, పోలీసులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.సోమవారం కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. అదే ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఉమర్ నాసిర్ దార్ అనే మరో ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ ఘటన అనంతరం లతీఫ్ కోసం గాలింపును మరింత విస్తృతం చేశారు. సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు అతడి కదలికలపై నిఘా పెట్టి, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు లతీఫ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అతడిని లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించారు. వీడియో కాల్ ద్వారా లతీఫ్‌ను సంప్రదించిన అధికారులు, ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కోరారు. లొంగిపోతే ఎలాంటి హాని కలగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, వారి విజ్ఞప్తిని లతీఫ్ తిరస్కరించారు. చివరకు భద్రతాబలగాలు లతీఫ్ను చుట్టుముట్టి హతం చేశాయి.
