ఓబీసీ కులగణన, ఎల్‌నినోపై కేంద్రం స్పందించాలి: సీఎం రేవంత్

ఓబీసీ కులగణన, ఎల్‌నినోపై కేంద్రం స్పందించాలి: సీఎం రేవంత్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 : తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించిన తరహాలో 2027లో కేంద్రం చేపట్టనున్న జనగణనలోనూ కులగణన చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయాలు సాధించామని తెలిపారు. నూతన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు స్వాగతం పలుకుతూ, మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ శ్రేణులు, బూత్‌ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని, దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఎనిమిది నెలలు తాగునీటి అవసరాలు తీర్చడం సవాలుగా మారనుందని, ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐదు నెలల పాటు ప్రజాబలం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.