రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించే ‘సంవిధాన్ రక్షా మార్చ్’

రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించే ‘సంవిధాన్ రక్షా మార్చ్’

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 25 :  రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మరియు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

 

భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

రేపు నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారని వెల్లడించారు.

 

రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల హక్కులను కాపాడుకునే బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వాములై రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు.