అక్రమ అండాల సేకరణపై సమగ్ర దర్యాప్తు జరపాలని గవర్నర్ కు విజ్ఞప్తి

అక్రమ అండాల సేకరణపై సమగ్ర దర్యాప్తు జరపాలని గవర్నర్ కు విజ్ఞప్తి

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 25 : తెలంగాణలో పేద, మధ్యతరగతి మహిళలను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ కోరింది. ఈ మేరకు కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, సభ్యురాలు ఉజ్మా షకీర్ బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి విచారణ వివరాలను వెల్లడించారు. ఉద్యోగాలు, ఈవెంట్ అవకాశాల పేరుతో వివిధ రాష్ట్రాల మహిళలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, వారి ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమ అండాల సేకరణకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అండాల సేకరణకు సంబంధించిన ఏఆర్‌టీ చట్టంలోని లోపాలను సవరించి మహిళల ఆరోగ్యం, హక్కులు, భద్రతకు మరింత రక్షణ కల్పించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలకు సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు.