పెండింగ్ రైల్వే పనుల పురోగతిపై బండి సంజయ్ సమీక్ష
కరీంనగర్, వెలుతురు , నవంబర్ 25 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి ఫలించింది. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లను అభివ్రుద్ధి చేసేందుకు దక్షణి మధ్య రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ మేరకు అతి త్వరలోనే అధికారుల బ్రుందాన్ని ఆయా స్టేషన్లకు పంపి అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపనుంది. దీంతోపాటు జమ్మికుంటలో వ్యాగన్ ఓర్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటుతోపాటు రోడ్ అండర్ పాస్ (ఆర్ యూబీ) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈరోజ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమై కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, డీజీఎం కిరణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత మూడేళ్లలో పనుల పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. మూడేళ్లయినా ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని అసంత్రుప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నూకపల్లి-మల్యాల స్టేషన్ అభివ్రుద్ధి, కరీంనగర్-హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ నిర్మాణం, కరీంనగర్ నుండి కొత్తపల్లి రైల్వే స్టేషన్ కు గూడ్స్ షెడ్ తరలింపు, జమ్మికుంటలో అంబేంద్కర్ విగ్రహం నుండి కొత్తపల్లి వరకు రోడ్ అండర్ పాస్ నిర్మాణం వంటి అంశాల పురోగతిని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ప్రధానంగా జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారాల పొడిగింపు, ప్రయాణీకుల కోసం షెడ్లు, ఆధునిక వెయిటింగ్ హాల్స్, తాగునీటి సౌకర్యం వంటి అంశాల విషయంలో తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.
ఈ సందర్బంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లను అభివ్రుద్ధి చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. త్వరలోనే అధికారుల బ్రుందాన్ని ఆయా స్టేషన్లకు పంపి ప్రతిపాదనలు రూపొందించడంతోపాటు నెల రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జమ్మికుంటలో త్వరలోనే ఆర్ యూబీ నిర్మిస్తామని చెప్పారు. దీంతోపాటు జమ్మికుంట స్టేషన్ వద్ద వ్యాగన్ ఓర్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ను సైతం త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉప్పల్ స్టేషన్ లో ప్రస్తుతం అన్ రిజర్వ్ డ్ టిక్కెట్ కౌంటర్ ఉందని, అక్కడే రిజర్వేషన్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కోరగా త్వరలోనే రిజర్వేషన్ కౌంటర్ ట్రయిల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పురోగతి అంశాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయని చెప్పిన అధికారులు డిసెంబర్ నాటికి సిరిసిల్ల వరకు వచ్చే ఏడాది జూన్ నాటికి వేములవాడ వరకు రైల్వే లేన్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అట్లాగే 2028 చివరి నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, అయినప్పటికీ కొండగట్టులో రైల్వే స్టేషన్ లేకపోవడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. కొండగట్టుకు దాదాపు 5 కి.మీల దూరంలోనున్న నూకపల్లి-మల్యాల వద్ద రైల్వే స్టేషన్ ఉండటంవల్ల భక్తులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొండగట్టు వద్దే రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. మనం ఏ పని చేసినా ప్రజలకు అత్యధిక మేలు కలిగించడమే లక్ష్యమని, ఈ విషయంలో అవసరమైతే నిబంధనలను కొంత సడలించాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు కొండగట్టు వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులను పంపి అధ్యయనం చేయించి నివేదిక రూపొందించి కేంద్రానికి పంపుతామని తెలిపారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించినప్పటికీ టాయిలెట్ల మెయింటెనెన్స్ సరిగా లేదని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్న కేంద్ర మంత్రి ప్రస్తావించారు. వెంటనే అధికారులను పంపి తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే జీఎం తెలిపారు. కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి రెండు సార్లు మాత్రమే రైలును నడుపుతున్నారని, ప్రజల నుండి ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వారానికి మూడు లేదా నాలుగు సార్లు తిరుపతికి రైలు నడిపేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. దీంతోపాటు ప్రస్తుతం అయ్యప్ప స్వామి భక్తులు ప్రతిరోజు వందలాది మంది కరీంనగర్ చుట్టు పక్కల నుండి శబరిమల వెళుతున్నందున, ఈ సీజన్ లోనే వారానికి కనీసం రెండు సార్లైనా కరీంనగర్ నుండి శబరిమల(కొట్టాయం లేదా చెంగనూర్)కు రైలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజస్తాన్ నుండి వ్యాపార అవసరాల కోసం పెద్ద ఎత్తున పెద్దపల్లికి పెద్ద సంఖ్యలు వ్యాపారులు, ఇతర ప్రయాణీకులు తరచూ వస్తుంటారని, ఈ నేపథ్యంలో చెన్నై- భగత్ కీ కోఠి (ట్రెయిన్ నెంబర్ 20625-20626) ట్రెయిన్ ను పెద్దపల్లి స్టేషన్ లో, సికింద్రాబాద్ – దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంటలో హోల్టింగ్ కల్పించాలని కోరారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి తగిన సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ లో రైల్వే రిజర్వేషన్ సెంటర్ శిథిలావస్థలో ఉంది. 2 షిఫ్ట్ లో నడుస్తోంది. పని వేళలను పొడిగించాలి. ‘‘మేయర్ తో మాట్లాడి కార్పొరేషన్ నిధులతో లేదా ఎంపీ లాడ్స్ నిధులతో మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకోవాలి. కొత్తపల్లిలో గూడ్స్ షెడ్ ను తరలించినప్పటికీ ప్రస్తుతం అది పని చేయడం లేదని, యుద్ద ప్రాతిపదికన దీనిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వెంటనే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని రైల్వే డీజీఎం చెప్పారు.
