ప్రపంచానికి తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల అవకాశాలను చాటిచెప్పేలా గ్లోబల్ సమ్మిట్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26 :
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా నిలపాలని సూచించారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు కూడా సదస్సులో ప్రతిబింబించాలని స్పష్టం చేశారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్య సాధనకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రతినిధులకు తెలంగాణ ఆతిథ్య సంప్రదాయాలు, సంస్కృతి, ప్రత్యేకతలు చాటిచెప్పేలా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గురువారం ప్రజాభవన్‌లోని ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారులు కె. రామకృష్ణారావు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సు ఏర్పాట్లపై శాఖలవారీగా జరుగుతున్న పురోగతిని అధికారులు వివరించారు.
సదస్సు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పురోగతిని మంత్రులందరికీ తెలియజేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇకపై సంబంధిత శాఖల అధికారులు ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే పరిశ్రమల రంగ ప్రముఖులతో సహా 1,700 మందికి పైగా ఆహ్వానితులు సదస్సులో పాల్గొనేందుకు తమ హాజరును ఖరారు చేసుకున్నారని, మరో 1,300 మంది అతిథులు కూడా హాజరుకానున్నారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతిథులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు, సదస్సు విజయవంతానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక కన్వెన్షన్ కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను మించే స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సముదాయాన్ని ప్రధాన వేదికగా వినియోగించడంతోపాటు, ప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా అదనపు హాళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సదస్సులో ఏర్పాటు చేయనున్న తెలంగాణ స్క్వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సీఎస్ తెలిపారు. అంతర్జాతీయ ప్రతినిధులు విశ్రాంతి తీసుకోవడానికి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికి అనువుగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవం, సంప్రదాయ కళలు, హస్తకళలు, ప్రత్యేక వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేలా తెలంగాణ స్క్వేర్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణతోపాటు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం, సంస్కృతి, ఆతిథ్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా సమ్మిట్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
