హైదరాబాద్ కు లష్కరే తోయిబా బెదిరింపులు
కాచిగూడ, వెలుతురు, నవంబర్ 26 : లష్కరే తోయిబా పేరుతో పోలీసులకు వచ్చిన ఈ-మెయిల్లో కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా లక్ష్యంగా చేసుకుని 300 మందిని హతమారుస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని అందులో ఉంది. నార్వే నుంచి మెయిల్ వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తాత్కాలిక డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీతో గుర్తుతెలియని వ్యక్తి పంపినట్లు గుర్తించారు. అయితే ఆ బెదిరింపు మెయిల్ బూటకమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీపీఎన్ నెట్‌వర్క్, ఐపీ అడ్రస్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి ఐటీ యాక్ట్ 66-డీ, బీఎన్‌ఎస్ సెక్షన్లను జోడించారు.
జాగిలాల బృందంతో తనిఖీలు
ఈ నేపథ్యంలో కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ ప్లాజాలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అలర్ట్గా వ్యవహరిస్తోంది. జాగిలాల బృందంతో పాటు పోలీసులు రైల్వే స్టేషన్‌లో నేడు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల కాచిగూడ పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ సైతం పరిశీలించారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, వదంతులు వ్యాప్తి చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
