అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీఆర్‌ఎస్ నేతలు

అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీఆర్‌ఎస్ నేతలు

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 26 :

 

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో అంబేడ్కర్‌ ఫొటో ముద్రించకపోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. జరిగిన పొరపాటుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడంతో పాటు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దని, అంబేడ్కర్‌ను అవమానిస్తున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, దాసోజు శ్రవణ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రజలంతా రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలను విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.