6 లక్షల ఆర్థిక సాయం చేసి ఉదారత చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27 :
ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లి, అనివార్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ‘పరిమళ’ అనే విద్యార్థినికి ఆయన తక్షణమే రూ. 6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నారు.
గతంలోనే పరిమళ ఉన్నత చదువుల కోసం ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
ఆమె చదువు పూర్తయ్యే వరకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ సమయంలో మంత్రి హామీ ఇచ్చారు. ఆ భరోసాతో ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన పరిమళకు, అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని డాక్యుమెంటేషన్ (పత్రాల) సమస్యలు ఎదురయ్యాయి. దీనివల్ల యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోవడంతో పాటు, ఆమె ‘ఎక్స్పాట్రియో’ (Expatrio) బ్యాంకు ఖాతా బ్లాక్ అయింది. ఫలితంగా తన ఖాతాలోని నగదును తీసుకోలేక, విదేశీ గడ్డపై రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ క్లిష్ట పరిస్థితిని పరిమళ మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు రూ. 6 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. రానున్న రెండు మూడు నెలల్లో డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడ జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా ఈ సహాయం తనకు ఎంతో ఊరటనిచ్చిందని పరిమళ తెలిపారు.
ఈ సందర్భంగా జర్మనీ నుంచి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన పరిమళ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఆదుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఇంతటి గొప్ప మనసున్న నాయకుడిని తాను ఎక్కడా చూడలేదని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే గొప్ప దృక్పథంతో మంత్రి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులు నిరాశ చెందకుండా స్పష్టమైన లక్ష్యం, పట్టుదలతో కష్టపడితే దాతలు తప్పకుండా ముందుకు వచ్చి ఆదుకుంటారని పరిమళ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
