సోషల్ మీడియా విభాగం బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27 :
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాన్ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సమన్వయాన్ని పటిష్టం చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ నవీన్ పెట్టెం ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సోషల్ మీడియా విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి బి.ఎం. సందీప్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో సోషల్ మీడియా విభాగం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా విభాగం సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమన్వయాన్ని మరింత మెరుగుపరిచి, సోషల్ మీడియా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని నేతలు చర్చించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిజా షెట్కర్, రాష్ట్ర కన్వీనర్ వంశీ, రాష్ట్ర సమన్వయకర్తలు విష్ణు, ఫరీద్, దినేష్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
