పెరిగిన బంగారం, వెండి ధరలు 

పెరిగిన బంగారం, వెండి ధరలు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 28 :

 

బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. తగ్గినట్టే తగ్గుతూ ఒక్కరోజులోనే మళ్ళీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,461గా ఉంది. శనివారం ఇది రూ.1,509 పెరిగి రూ.1,29,970కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,700గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ గోల్డ్‌ ధర 3,653 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

 

బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో శుక్రవారం కిలో వెండి ధర రూ.1,56,244గా ఉండగా, శనివారం రూ.1,602 పెరిగి రూ.1,57,846కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ సిల్వర్‌ ధర 43.62 డాలర్ల వద్ద ఉంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్‌, అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపిస్తోంది.