హైదరాబాద్, వెలుతురు ఆగష్టు 6:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఎల్. రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సి. అంజిరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరై ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మూడు తరాల ఉద్యమాలలో జయశంకర్ పాత్ర ఉందని, ఆయన నిరాడంబర జీవనం, నిజాయితీ, నిబద్ధతతో సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే లక్ష్యంగా ఆ మహనీయుడు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి వివరిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన గొప్ప నాయకుడని అన్నారు.



