150 పోస్టులకే వేల మంది క్యూ: హరీశ్‌రావు

  • నిరుద్యోగులను అవమానిస్తారా?
  • హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల దరఖాస్తులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం
  • నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరం
  • ఉద్యోగం కోసం రావడం తప్పా.. ఉద్యోగాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ తప్పా?
  • విద్యార్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష?: హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 8:

హైడ్రాలో డ్రైవర్‌ పోస్టుల భర్తీ కోసం వచ్చిన నిరుద్యోగులను అవమానించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే దుర్భాషలాడటం బాధాకరమని పేర్కొన్నారు. నిరుద్యోగులను అవమానించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాల కోసం యువత రోడ్లపైకి వస్తే వారిపట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

150 పోస్టులకు వేలాదిగా నిరుద్యోగులు

హైడ్రాలో కేవలం 150 డ్రైవర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడితేనే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో యువత రావడం వారి తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం తప్పా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం వచ్చిన యువతను అవమానించడం సరికాదని.. వారితో గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. 32 నెలలు దాటినా ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. 150 డ్రైవర్‌ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.

జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌

రెండు లక్షల ఉద్యోగాల హామీ, జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ బోగస్‌ అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ పాలనపై యువతలో నిరాశ పెరుగుతోందని ఆరోపించారు. సక్రమంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య చదివిన యువత సైతం చిన్నచిన్న పోస్టులకు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

నిరుద్యోగులు ప్రభుత్వాన్ని జాలి అడగడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని హరీశ్‌రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.