హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 8:
మహాత్మా జ్యోతిబాపూలే దంపతులు 14 వ తేదీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 18 వ తేదీ జరిగే విగ్రహావిష్కరణల సభలు విజయవంతం చేసేలా ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలు పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, రాబోయే విగ్రహావిష్కరణ కార్యక్రమాలు, బీసీ వర్గాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
హైదరాబాద్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ పక్కన ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఈ నెల 14న ప్రారంభించేందుకు నిర్ణయించారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని 18న ప్రారంభించే కార్యక్రమంపై చర్చించారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశంలో తీర్మానించారు. ముఖ్యమంత్రిని కలిసి బీసీ వర్గాల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చర్చించాలని నిర్ణయించారు.
పూలే దంపతుల విగ్రహావిష్కరణ సభను ఘనంగా నిర్వహించాలి
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సమావేశం పిలుపునిచ్చింది. పూలే దంపతుల ఆశయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
బీసీ కులగణనపై తదుపరి కార్యాచరణ
రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టినప్పటికీ, బీసీ వర్గాల ఆకాంక్షలు, లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదనే అభిప్రాయంతో తదుపరి కార్యాచరణపై ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించే అంశంపై కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే బీసీ కమిషన్‌ను మరింత బలోపేతం చేసి, బీసీల సమస్యల పరిష్కారంలో కమిషన్‌కు అవసరమైన సహకారం అందించాలని చర్చించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగిస్తోందని సమావేశంలో పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారీగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
బీసీ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి
బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. బీసీ వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధులు కేటాయించి, సంక్షేమం, ఉపాధి, ఆర్థిక సాధికారతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి వేగం
రాష్ట్రంలోని వివిధ బీసీ కుల సంఘాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించి, నిర్మాణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.అదేవిధంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు నిర్ణయించారు.బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వి. హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్, వీర్లపల్లి శంకర్, జూమ్ ద్వారా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

