బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం: బండి సంజయ్‌

  • బోనాల వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి
  • భాగ్యలక్ష్మి ఆలయంపై కీలక హామీ
  • పాతబస్తీలో బోనాలకు భారీ నిధులు
  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ విమర్శలు
  • ఆలయాలకు నిధుల కేటాయింపుపై ప్రశ్నలు
  • కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు
  • హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపు
  • జెన్‌-జీకి ఉద్యమ స్ఫూర్తి అవసరమన్న బండి
  • పాతబస్తీ హిందువులదేనని వ్యాఖ్యలు
  • సనాతన ధర్మం కోసం కృషికి పిలుపు

హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 09:

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్‌ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ‘గోల్డెన్‌ టెంపుల్‌’గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడంతో పాటు.. ఎవరూ ఊహించని స్థాయిలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో తాను చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడంపై అప్పట్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హేళన చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్‌ అదే అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం చూస్తుంటే ఆయనకు జ్ఞానోదయం అయినట్లుందని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో లాల్‌దర్వాజ ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చి అమలు చేయలేదని బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజలను మాత్రమే కాకుండా దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. లాల్‌దర్వాజ బోనాల కోసం ప్రభుత్వం కేవలం రూ.5.50 లక్షలు మాత్రమే కేటాయించిందని అన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఆలయానికి ఇంత తక్కువ మొత్తం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రంజాన్‌కు రూ.33 కోట్లు కేటాయిస్తూ అధిక సంఖ్యలో హిందువులు పూజించే ఆలయాలకు తక్కువ నిధులు ఇవ్వడం ఏంటని నిలదీశారు.

ఒవైసీ బాధపడతారనే కారణంతో సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. పాతబస్తీలో పన్నులు చెల్లిస్తున్న వారిలో హిందువులు కూడా ఉన్నారని, వారి డబ్బును వారి ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ అంశాలను ప్రశ్నిస్తే తనకు మతతత్వవాది అనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాతబస్తీ హిందువులకు కూడా సమానంగా చెందుతుందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. హిందూ సమాజాన్ని చైతన్యపరచడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తనను విమర్శించే రాజకీయ నాయకులు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా హిందువులంతా సంఘటితం కావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. జెన్‌-జీ తరం ఉద్యమ స్ఫూర్తితో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. హిందూ సమాజ ఐక్యత కోసం యువత ముందుకు రావాలని కోరారు.

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే పాతబస్తీలో బోనాల ఉత్సవాలను అన్ని సౌకర్యాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. ఉత్సవాల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.

సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న యువతకు మరింత శక్తిని ప్రసాదించాలని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.