పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు హాజరైన మాజీ సీఎం
  • కుటుంబసభ్యులకు పరామర్శ
  • సుదర్శన్‌ రెడ్డితో అనుబంధం గుర్తుచేసుకున్న కేసీఆర్‌
  • సాదాసీదా వ్యక్తిగా కొనియాడిన మాజీ సీఎం
  • కేసీఆర్‌ రాకతో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
  • నివాసం వద్ద స్వల్ప తోపులాట
  • పోలీసుల పర్యవేక్షణలో కాన్వాయ్‌
  • కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
  • రూ 2. 25 కోట్ల సాయం ప్రకటించిన బీఆర్‌ఎస్‌

వరంగల్, వెలుతురు, ఆగస్టు 9:

వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు    చేసుకున్నారు. ఆయన మృతిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సుదర్శన్‌రెడ్డి ఎంతో సాదాసీదాగా జీవించారని, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ నల్లబెల్లి పర్యటనకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసం పరిసరాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కొద్దిసేపు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసీఆర్‌ కాన్వాయ్‌కు మార్గం సుగమం చేశారు. అనంతరం ఆయనను సుదర్శన్‌రెడ్డి నివాసం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులతో మాట్లాడిన కేసీఆర్‌ వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ భవిష్యత్‌ అవసరాలు, బాగోగుల కోసం రూ. 25 లక్షలను బ్యాంకులో జమ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. పిల్లల చదువు, భవిష్యత్తు సహా కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది.

సుదర్శన్‌రెడ్డి కుటుంబం ఒంటరిగా లేదని, పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి, సుదర్శన్‌రెడ్డి సేవలను స్మరించుకున్నారు. కేసీఆర్‌ పర్యటనతో నల్లబెల్లిలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సుదర్శన్‌రెడ్డి ఇంట్లో 40 నిమిషాల పాటు గడిపిన కేసీఆర్‌ తర్వాత తిరుగు పయనమయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.