కుమురం భీమ్‌ స్ఫూర్తితో గిరిజన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: సీతక్క

  • అశ్వారావుపేటలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు
  • కుమురం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
  • గిరిజన హక్కుల పరిరక్షణకు పిలుపు
  • పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్న సీతక్క
  • రాజ్యాంగ హక్కులను వినియోగించుకోవాలని సూచన
  • భాష, సంస్కృతి కాపాడుకోవడం బాధ్యత
  • ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి
  • అధికారుల తీరుపై మంత్రి కీలక సూచనలు
  • సీఎం రేవంత్‌కు గిరిజనులపై ప్రత్యేక అభిమానం
  • హక్కుల సాధనకు ఐక్యతే బలమన్న మంత్రి

అశ్వారావుపేట, వెలుతురు, ఆగష్టు 9:

కుమురం భీమ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గిరిజనులంతా ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీతక్క పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, గౌరవం, జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కుమురం భీమ్‌ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. తమ చరిత్ర మొత్తం పోరాటాలతో ముడిపడి ఉందని సీతక్క అన్నారు. ప్రకృతితో మమేకమై జీవనం సాగించిన పూర్వీకులు అడవులు, కొండలు, వర్షాలు, వరదలు, జంతువులతో పోరాడుతూ తమ జీవనాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ నుంచి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురం భీమ్‌ వరకు ఎందరో తమకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

రాజ్యాంగం గిరిజనులకు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి, భూ హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిందని మంత్రి వివరించారు. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ కల్పించేలా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ రూపుదిద్దుకుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆరో షెడ్యూల్‌ కింద ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ప్రాంతాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

గిరిజనులు ఎవరిపైనా శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదని సీతక్క స్పష్టం చేశారు. ఏ కులాన్నీ, ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. అయితే రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి మాత్రం గిరిజనులు ఐక్యంగా తమ గొంతు వినిపించాలని సూచించారు.

గిరిజనేతరుడైన అల్లూరి సీతారామరాజు కూడా గిరిజనుల హక్కుల కోసం పోరాడారని సీతక్క గుర్తుచేశారు. తమపై ప్రేమతో వచ్చిన వారిని గిరిజనులు ఎప్పుడూ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ప్రత్యేకంగా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ప్రతి గిరిజనుడి హక్కు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అడవి బిడ్డలు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక అభిమానం ఉందని సీతక్క అన్నారు. దేశంలో మరెక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల సమస్యలతో పాటు దళితులు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

భూముల సమస్యలు సహా గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. పేదలు, నిరక్షరాస్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రజల వినతులను గౌరవంగా స్వీకరించి, సాధ్యమైన మేరకు సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

కొమరం భీమ్, రాంజీ గోండు, సమ్మక్క-సారలమ్మ వంటి ఆదివాసీ వీరుల పోరాట చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, డి.ఆర్.డి.ఓ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, కొండరెడ్డి, నాయకపోడు తదితర గిరిజన వర్గాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.