రండి.. రక్తదానం చేద్దాం

హైదరాబాద్ : రక్తం అందుబాటులో లేక ఏ రోగికీ చికిత్స ఆలస్యం అవకూడదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆరోగ్యవంతులు క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జాతీయ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్‌లో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే తల్లులు, తలసేమియా చిన్నారులు, కేన్స‌ర్ రోగులు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం ఎంతో కీలకమని మంత్రి తెలిపారు.
యువత, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఎన్జీవోలు, వివిధ సంస్థలు రెగ్యులర్‌గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. స్వచ్చంద రక్త దానానికి యువత ముందుకొస్తే,
అత్యవసర సమయంలో రక్తం కోసం కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను, బ్లడ్ డొనేషన్ క్యాంపులను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించిన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ బృందాన్ని మంత్రి అభినందించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే గొప్ప మానవతా కార్యక్రమమని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.