వర్షాభావ పరిస్థితులపై కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

హైదరాబాద్, అక్టోబర్ 1: వర్షాభావ పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం సచివాలయంలో ఎపిసి, మార్క్‌ఫెడ్ ఎండీ, ఆయిల్‌ఫెడ్ ఎండీ అధికారులతో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంటల మద్దతు ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరువు పరిస్థితులను గుర్తించేందుకు వర్షపాతం, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భజలాల స్థాయిలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రతను వివిధ సూచికల ఆధారంగా అంచనా వేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మద్దతు ధర ప్రకటించడం, పెంచడంతోనే కేంద్ర ప్రభుత్వ బాధ్యత పూర్తికాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన అన్ని పంటలను కేంద్ర ప్రభుత్వం 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ప్రకటించిన మద్దతు ధరకు పంటల సేకరణ పూర్తిస్థాయిలో జరిగినప్పుడే రైతులకు దాని పూర్తి ప్రయోజనం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.