హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 02 : కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకం లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహ భారాన్ని తగ్గిస్తూ సామాజిక సంస్కరణకు ఈ పథకం నాంది పలికిందని పేర్కొన్నారు.
ఒక తండ్రి తన కుమార్తె వివాహం కోసం దాచుకున్న డబ్బు, బంగారం అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఘటనతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని హరీశ్‌రావు తెలిపారు. 2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాదంలో బానోతు కీమానాయక్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితిని చూసి కేసీఆర్ స్పందించారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ బాలిక వివాహాన్ని జరిపించి ఆర్థిక సాయం అందించారని, అనంతరం ఈ ఆలోచన కార్యాచరణ రూపం దాల్చి కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకంగా మారిందని వివరించారు.
2014 అక్టోబర్ 2న రూ.51 వేల ఆర్థిక సాయంతో పథకాన్ని ప్రారంభించారని, 2017లో రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచారని హరీశ్‌రావు తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.
కళ్యాణ లక్ష్మీ ఒక సంక్షేమ పథకం మాత్రమే కాకుండా బాల్య వివాహాల నిర్మూలనకు, పేద కుటుంబాలకు అండగా నిలిచే సామాజిక కార్యక్రమంగా మారిందని హరీశ్‌రావు అన్నారు.
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకం పట్ల నిర్లక్ష్యం నెలకొందని హరీశ్‌రావు ఆరోపించారు. పెళ్లిళ్లు పూర్తయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పథకం డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం అందులో సగం కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేసినట్లే కళ్యాణ లక్ష్మీని కూడా నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని అమలు చేస్తూ ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డలకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం తులం బంగారం హామీ అమలుకు సంబంధించి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను నిలిపివేయాలని, ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.లక్షతో పాటు తులం బంగారం హామీని అమలు చేయాలని కోరారు. ఈ పథకాన్ని రాజకీయ కక్షలకు బలిచేయకుండా పేదింటి ఆడబిడ్డలకు అండగా కొనసాగించాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
