వికారాబాద్, వెలుతురు : వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
