హైదరాబాద్, వెలుతురు అక్టోబర్ 05
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ… తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఒకరోజు శాంతియుత సత్యాగ్రహ దీక్ష అత్యంత స్పూర్తిదాయకంగా నిర్వహించబడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఈ దీక్షను నేతృత్వం వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, వెంటనే రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల తొలగింపు కుట్ర: ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించి, కోట్ల సంఖ్యలో అర్హులైన పేదల ఓట్లను తొలగిస్తూ ఓటు హక్కును కాలరాస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడి అని ఆరోపించారు. వ్యవస్థల దుర్వినియోగం : స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘాన్ని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం కీలుబొమ్మలా మార్చుకుందని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, హోంమంత్రుల వైఫల్యం: దేశంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య విలువలను మంటకలుపుతున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, వారు వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సత్యాగ్రహమే మన అస్త్రం : మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకోసం కాంగ్రెస్ సేవాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
