నకిరేకొమ్ముల గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న

కోహెడ, అక్టోబర్ 6 : హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎంన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మంజూరైన రూ.8 లక్షల విలువైన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 

గ్రామ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన మంత్రి.. సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత విద్యుత్, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ, గ్రామ పంచాయతీ భవనం, వంతెన, చెక్‌డ్యామ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రైతులు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరుతడి పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని మంత్రి సూచించారు. నకిరేకొమ్ములలో విస్తృతంగా ఆయిల్‌పామ్ సాగు చేపడితే గ్రామానికి రూ.10 లక్షల ఇనాం అందజేస్తామని ప్రకటించారు. గ్రామంలో అంగన్‌వాడీ భవనం, మహిళా సంఘ భవనం, ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెక్‌డ్యామ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, నారాయణపూర్ రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. పాత పాఠశాల భవనాన్ని పరిశీలించి అవసరమైతే నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.