కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 2010 జూన్ 17న శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వాముల చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఈ ఆలయం 16 ఏళ్లలో లక్షలాది భక్తుల విశ్వాస క్షేత్రంగా ఎదిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పదిరోజుల పాటు అమ్మవారు బాలాత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, మహిషాసురమర్దిని, లలితాదేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి, రాజరాజేశ్వరి తదితర రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చండీ పారాయణం, సహస్రనామ పారాయణం, చండీ హోమం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 108 రకాల నైవేద్యాలు, అన్నదానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నవరాత్రి సందర్భంగా వేలాది మంది భవానీ దీక్షాపరులతో ఆలయం కిటకిటలాడనుంది. భక్తి పారవశ్యంతో నిర్వహించే దాండియా కార్యక్రమం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏడాది పొడవునా వివిధ పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
