క్రిషాంక్‌పై మరోసారి కేసు.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆగ్రహ
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత క్రిషాంక్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మెడి కవర్‌తో పాటు పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ క్రిషాంక్ నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించి ఇప్పటికే సీసీఎస్‌లో కేసు నమోదైందని తెలిపింది. అదే అంశానికి సంబంధించి తాజాగా గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారని పేర్కొంది.
ఒకే అంశం లేదా ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, క్రిషాంక్‌ను అరెస్టు చేసి పోలీసులు వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారని, అనంతరం సికింద్రాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై క్రిషాంక్ సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్నందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులా? అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు పోలీసు కేసులను ఉపయోగించకుండా, రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిలిపివేసి క్రిషాంక్ లేవనెత్తిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
