ఈసీని బీజేపీ అనుబంధ సంస్థలా మార్చేశారు : పొన్నం

కోహెడ ; దేశంలో ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని రాష్ట్ర రవాణా , బీ.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ మండలం నకిరికొమ్ముల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఒక్క అర్హులైన ఓటరు కూడా లిస్టు నుంచి గల్లంతు కాకూడదనే ఉద్దేశంతో సవరణలు జరిగేవని, కానీ ప్రస్తుతం కమిషన్ అధికారులు భయంతో, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక, బీహార్, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందే గెలుపు కోసం ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గల్లీ గల్లీలో ‘ఓట్ బచావో’ పోరు..

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేతలు స్పష్టం చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఓట్లను కాపాడేందుకు కాంగ్రెస్‌తో పాటు ప్రజాస్వామిక పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్తంగా గల్లీ గల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ పేరిట ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును వినకుండా కేవలం ‘మన్ కీ బాత్’ పేరుతో తమ మాటలే వినాలనే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పౌర సమాజం, రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈసీ తీరు మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.