హైదరాబాద్ నగర వాసులకు గ్రామీణ భారతీయ కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఒకే వేదికపై ఆస్వాదించే అవకాశం రానుంది. అక్టోబర్ 7 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సారస్ మేళా జరగనుంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ ఈ మేళాను నిర్వహిస్తోంది. 20 రాష్ట్రాలకు చెందిన గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ వేదికగా సారస్ నిలవనుంది. ఈసారి సారస్ మేళాలో మొత్తం 200 కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవే 95 కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవి 100 కు పైగా ఉన్నాయి. ఇవే కాకుండా….వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 43 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. హస్తకళలు, చేనేతలు, ఆహార ఉత్పత్తులు, హెర్బల్ ఉత్పత్తులు, ప్రొడక్షన్ ఐటమ్స్, లైవ్ ఫుడ్ విభాగాల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి.
ఒకే చోట తెలంగాణ చేనేతల అందం.. దేశీ రుచుల వైవిధ్యం
సారస్ మేళాలో అడుగుపెడితే తెలంగాణ పల్లెల సృజనాత్మకత నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతల వరకు ఒకే ప్రాంగణంలో కనిపించనున్నాయి. ఒక వైపు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతల అందం.. మరోవైపు గ్రామీణ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న హస్తకళలు.. ఇంకోవైపు పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పదార్థాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. తెలంగాణ నుంచి 32 హస్తకళల స్టాళ్లు, 20 చేనేత స్టాళ్లు, 30 ఆహార ఉత్పత్తుల స్టాళ్లు, 4 హెర్బల్ ఉత్పత్తుల స్టాళ్లు, 3 ప్రొడక్షన్ ఐటమ్స్, 6 లైవ్ ఫుడ్ స్టాళ్లు కలిపి మొత్తం 95 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. చెక్క బొమ్మలు, జూట్ బ్యాగులు, లెదర్ బ్యాగులు, మట్టి వస్తువులు, బంజారా కళాకృతులు, ఎంబ్రాయిడరీ, వివిధ ఆర్ట్ వర్క్స్‌తో పాటు పచ్చళ్లు, పొడులు, పిండి వంటలు, మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
22 రాష్ట్రాల గ్రామీణ ప్రతిభ
తెలంగాణతో పాటు దేశంలోని 21 ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులతో పాల్గొంటున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 స్టాళ్లు, అండమాన్ నికోబార్ నుంచి 1, అసోం 1, బీహార్ 3, ఛత్తీస్‌గఢ్ 3, గోవా 2, గుజరాత్ 4, హిమాచల్‌ప్రదేశ్ 1, జమ్మూకశ్మీర్ 1, కర్ణాటక 5, కేరళ 7, మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్ర 6, మణిపూర్ 2, ఒడిశా 5, రాజస్థాన్ 7, సిక్కిం 1, తమిళనాడు 6, త్రిపుర 2, ఉత్తరప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణతో పాటు ఇతర సంస్థల ఉత్పత్తులకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ఏఎల్‌ఈఏపీ ఆధ్వర్యంలో 4, మెప్మా 15, నాబార్డ్ 10, టీజీ హెచ్‌డీసీ (గోల్కొండ) 2, టీజీఎస్‌సీఓ 1, ట్రైఫెడ్ 2, విజయ డెయిరీ 1, వీ హబ్ 8 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 43 స్టాళ్లలో వివిధ సంస్థల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు.
పల్లె ఉత్పత్తికి పట్టణ మార్కెట్
సారస్ మేళా కేవలం కొనుగోలు, విక్రయాల ప్రదర్శన మాత్రమే కాదు. గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పట్టణ వినియోగదారుల ముందుకు తీసుకెళ్లే మార్కెట్ అనుసంధాన వేదిక. తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మహిళా పారిశ్రామికవేత్తలు నేరుగా తెలుసుకునే అవకాశం ఇందులో లభిస్తుంది. ఏ ఉత్పత్తికి ఎక్కువ ఆదరణ ఉంది? ఏ ప్యాకేజింగ్ ఆకట్టుకుంటోంది? ధర విషయంలో వినియోగదారుల అభిప్రాయం ఏమిటి? ఏ ఉత్పత్తులను మరింత మెరుగుపరచాలి? వంటి అంశాలపై ప్రత్యక్ష మార్కెట్ అనుభవం పొందే అవకాశం మహిళా సంఘాలకు లభిస్తుంది. ఇలాంటి మేళాల ద్వారా ఒక గ్రామంలో తయారైన ఉత్పత్తి హైదరాబాద్ వంటి పెద్ద నగర మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడి నుంచి మరిన్ని మార్కెట్ లింకేజీలు, బల్క్ ఆర్డర్లు, సంస్థాగత కొనుగోళ్లకు అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సారస్ మేళా లక్ష్యాల్లో పట్టణ వినియోగదారుల్లో అవగాహన పెంచడం, మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఉత్పత్తిదారులకు బల్క్ ఆర్డర్లు, వ్యాపార అనుసంధానాలకు అవకాశాలు కల్పించడం కూడా ఉన్నాయి.
పల్లె నుంచి నగరానికి.. మహిళ చేతి నుంచి వినియోగదారుడి ఇంటికి
ఒకప్పుడు గ్రామంలో తయారైన వస్తువు గ్రామ పరిధిలోనే అమ్ముడయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే ఉత్పత్తి హైదరాబాద్ వంటి మహానగరంలో వేలాది మంది వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇది గ్రామీణ మహిళల వ్యాపార ప్రయాణంలో కీలకమైన మార్పు. సారస్ మేళాలో ఉత్పత్తులను విక్రయించడంతో పాటు ఇతర ప్రాంతాల మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారులతో పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్త డిజైన్లు, ప్యాకేజింగ్ విధానాలు, ఉత్పత్తుల తయారీ పద్ధతులు, మార్కెటింగ్ విధానాలపై అవగాహన పెరుగుతుంది. తెలంగాణ మహిళలు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల ఉత్పత్తులతో పోల్చుకుని మరింత మెరుగైన నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వైపు అడుగులు వేయడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది.
పండుగ వాతావరణంలో పల్లె సంస్కృతి
అక్టోబర్ 7 నుంచి 18 వరకు జరిగే ఈ మేళా కేవలం షాపింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా కుటుంబంతో కలిసి సందర్శించేలా పండుగ వాతావరణాన్ని కల్పించనుంది. ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. అక్టోబర్ 11న మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు, ప్రముఖులు సారస్ మేళాను సందర్శించనున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను గ్రాండ్ స్కేల్‌లో నిర్వహించనున్నారు. అందువల్ల ఈసారి సారస్ మేళా హైదరాబాద్ నగరానికి గ్రామీణ భారతదేశపు రంగులు, రుచులు, కళలు, చేనేతలను దగ్గర చేయనుంది. ఒకే ప్రాంగణంలో దేశంలోని వివిధ ప్రాంతాల ఉత్పత్తులను చూసే అవకాశం.. నచ్చిన వస్తువులను నేరుగా వాటిని తయారు చేసిన మహిళలు, కళాకారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం.. అదే సమయంలో గ్రామీణ కుటుంబాల ఆదాయానికి తోడ్పడే అవకాశం సారస్ మేళాను ప్రత్యేకంగా నిలపనుంది.
