విదేశాల్లోనూ వెలుగుతున్న తెలంగాణ సంస్కృతి

స్విట్జర్లాండ్-అక్టోబర్ 8: విదేశాల్లో స్థిరపడినా మాతృభాషను, మన సంస్కృతి, సాంప్రదాయాలను మరువకుండా కాపాడుతుండడం అంద‌రూ హర్షించదగ్గ విషయమని తెలంగాణ శాసనసభ సభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్  అన్నారు. చిన్న పిల్లలకు తెలుగు భాష నేర్పిస్తూ, బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలను నిర్వహిస్తూ భాషా సంస్కృతిని స్విట్జర్లాండ్ లో ఇనుమడింపజేయడం భావితరాలకు ఆదర్శమన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ లోని బెర్న్ సిటీలో ప‌ర్య‌టించింది.  స్పీకర్ గారి మిత్రులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి బావిగడ్డ గారి ఆహ్వానం మేరకు అక్కడి ప్రవాస తెలుగు భారతీయులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్ సైట్ ను స్పీకర్ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఆ త‌ర్వాత‌ ప్రవాస తెలుగు సంఘం ప్రతినిధులతోనూ మాట్లాడారు. స్విట్జర్లాండ్ లో నిర్మించబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి స్పీకర్ బృందానికి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం ప్ర‌తినిధులు తెలియజేశారు. టెంపుల్ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు, సహాయ సహకారాల గురించి తప్పకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ప్రతినిధులతో మాట్లాడి.. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పీకర్ ప్ర‌సాద్ కుమార్ గారు హామీ ఇచ్చారు. బతుకమ్మ ఉత్సవం అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళా శక్తికి, ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక అని స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు పేర్కొన్నారు. ఇలా ప్రతి ఏటా స్విట్జర్లాండ్ లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంఘం ప్రతినిధులను స్పీకర్ గారి బృందం అభినందించింది. ఈ నెల 24వ తేదీన స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పీక‌ర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి రెండ్ల‌ తిరుపతి గారు, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశం, స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు కిరణ్ వేదాంతం గారు, కార్యదర్శి హరి ప్రసాద్, ఈసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.