లోక్ భవన్ ముట్టడికి యత్నించిన మంత్రి వాకిటి శ్రీహరి అరెస్ట్

హైదరాబాద్, అక్టోబర్ 8 : ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్ భవన్ ముట్టడికి యత్నించిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైన హక్కు అని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకూడదని అన్నారు. “ఓట్ చోర్” ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని మంత్రి అన్నారు. SC, ST, BC, మైనారిటీలు సహా అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు. “అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఓటు హక్కును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, స్వతంత్రతపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందే” అని వాకిటి శ్రీహరి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరిన నేపథ్యంలో మరింత పారదర్శకత అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు పోరాటం ఆగదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.