హైదరాబాద్ : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం మూడోసారి వెనక్కి పంపడం పాలమూరు ప్రజలకు అవమానమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 90 టీఎంసీల నీటి కేటాయింపుపై స్పష్టత లేదనడం కుంటి సాకుగా అభివర్ణించారు. ప్రాజెక్టుకు ఇప్పటికే 60 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. వారం రోజుల్లో నార్లాపూర్ పంపులు ఆన్ చేయకపోతే రైతులతో కలిసి అక్కడే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడం వెనుక బనకచర్ల అంశం ఉందని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే రైతులు తిరగబడతారని హెచ్చరించారు.
