హైదరాబాద్: ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం లోక్ భవన్ వద్ద నిరసనకు దిగిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయడం పూర్తిగా అక్రమం, అప్రజాస్వామికం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన ప్రక్రియను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మంత్రి స్పష్టం చేశారు.
