జహీరాబాద్, వెలుతురు, అక్టోబర్ 10:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మెడ్‌ఎక్స్ (MEDX) డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బందిని దూషించి, దాడి చేసి, డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ లవకుమార్ శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన మేతరి సురేష్ (33) సెప్టెంబర్ 19న మెడ్‌ఎక్స్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వచ్చి స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకుని నివేదికలు తీసుకెళ్లాడు. అనంతరం అక్టోబర్ 9న సాయంత్రం 5 గంటలకు తిరిగి కేంద్రానికి వచ్చి, తనకు తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే డయాగ్నొస్టిక్ సెంటర్‌పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని, కేంద్రానికి నిప్పంటిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఇనుప రాడ్‌తో ఫిర్యాదుదారు మహమ్మద్ మిన్హాజ్, అతని స్నేహితుడు సలీంపై దాడి చేసి గాయపరిచినట్లు ఆరోపణలున్నాయి. కేంద్రంలోని ఎక్స్‌రే యంత్రం, రిసెప్షన్ కంప్యూటర్, కౌంటర్ టేబుల్, అల్ట్రాసౌండ్ యంత్రం, బయోమెట్రీ యంత్రం, వీల్‌చైర్, ప్రధాన ద్వారం తదితర వస్తువులను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు జహీరాబాద్ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 443/2026 కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 10న మేతరి సురేష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ లవకుమార్ తెలిపారు.
