తేదీ, సమయం చెప్పండి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పొన్నం సవాల్

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 11 : ఓటర్ల జాబితా సవరణలో ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తన ముందుకు తీసుకువస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తేదీ, సమయం ప్రకటించాలని సవాల్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలు చేస్తున్న ఆందోళనలను కించపరచడం సరికాదన్నారు. పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకునేందుకు ఇబ్బందులు పడకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

ఎన్ని ఓట్లు తొలగించారు.. వాటిలో అనర్హులైనవి ఎన్ని, పొరపాటున అర్హులైన వారి ఓట్లు తొలగించారా అనే వివరాలను ఎన్నికల రికార్డుల ఆధారంగా వెల్లడించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. “ఓటు బచావో–దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.