నిజామాబాద్, అక్టోబర్11 : నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 275 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం రూ. 2,75,31,900 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ఆడబిడ్డల వివాహాలు పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్ పథకం కింద 149 మంది లబ్ధిదారులకు రూ. 1,49,17,284, కళ్యాణ లక్ష్మి పథకం కింద 126 మంది లబ్ధిదారులకు రూ. 1,26,14,616 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం 275 మంది లబ్ధిదారులకు రూ. 2,75,31,900 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టిందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NUDA చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
