హైదరాబాద్, వెలుతురు అక్టోబర్ 12 : ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే గెలిచేందుకు అవకాశం ఉండేలా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో ఎన్నికల కమిషన్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ పౌరుల ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పౌరుల ఓటు హక్కు అత్యంత బలమైన పునాది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటు హక్కుకు విఘాతం కలిగించే అక్రమాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో బీజేపీ మాత్రమే గెలిచే పరిస్థితులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా దేశ ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీకి లేదా ఆ పార్టీ నాయకులకు సంబంధించిన ఓట్ల కోసం మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం కోసమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గాంధేయ మార్గంలో సత్యాగ్రహం ఓటర్ల హక్కులకు సంబంధించిన సమస్యలను వివిధ రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ప్రయత్నించిందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రపతిని కలిసి వినతులు సమర్పించడంతోపాటు సంబంధిత వ్యవస్థల దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో రాజ్యాంగ వ్యవస్థ దృష్టికి ఓటు హక్కుల పరిరక్షణ అంశాన్ని తీసుకెళ్లేందుకు ఢిల్లీలో శాంతియుతంగా, గాంధేయ మార్గంలో సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల భారీ భాగస్వామ్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ నుంచి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ తదితర అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, పౌరుల ఓటు హక్కును కాపాడేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
