హైదరాబాద్, అక్టోబర్ 12 : ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి అంతర్జాతీయ శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరం అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీని జపాన్ హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జపాన్ దేశానికి చెందిన హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రిఫెక్చరల్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహాచార్యులు గారు, శాసనసభ సెక్రెటరీ ఆర్. తిరుపతి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు.. జపాన్ ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసనసభ తరఫున ఘన స్వాగతం పలికారు. భారతదేశం, జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్నారు. జపాన్ దేశం సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణ, పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కూడా సమాచార సాంకేతికత, ఫార్మా, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జపాన్లోని హిరోషిమా ప్రాంతం మధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిరోషిమా నగరం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొన్నప్పటికీ శాంతి, పునర్నిర్మాణం, అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. హిరోషిమా ప్రజలు చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల, శాంతి సందేశం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం, సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దేశాల మధ్య పరస్పర సహకారం అత్యంత అవసరమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభల పాత్ర ఎంతో కీలకమని, వివిధ దేశాల శాసనసభల మధ్య జరిగే ఇటువంటి సమావేశాలు శాసన ప్రక్రియలు, పరిపాలనా విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై పరస్పర అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి జపాన్లోని మియోషి నగరంతో ఉన్న సోదర నగర సంబంధాలు ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక, సామాజిక అనుబంధానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జపాన్ పెట్టుబడులు మరింత పెరగాలని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేందుకు పరస్పర సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పర్యటన భారత్–జపాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం, జపాన్ దేశాల మధ్య చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభను జపాన్ హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. తెలంగాణ, హిరోషిమా ప్రాంతాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలు, విద్య, పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, పరిశోధన, పారిశ్రామిక రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. జపాన్ దేశానికి చెందిన పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, దీని ద్వారా రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాల్లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, తెలంగాణలోని మానవ వనరులను సమన్వయం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశాల్లో శాసనసభలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని, ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపొందించడంలో శాసనసభల పాత్ర అత్యంత ముఖ్యమైనదని వివరించారు. తెలంగాణ శాసనసభ, హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ మధ్య శాసన విధానాలు, సభా నిర్వహణ, శాసనసభ కమిటీల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై పరస్పర అనుభవాలను పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రెండు ప్రాంతాల శాసనసభల మధ్య ప్రతినిధుల పర్యటనలు, అధ్యయన కార్యక్రమాలు, పరస్పర చర్చలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జపాన్ దేశం నుంచి క్రమశిక్షణ, సమయపాలన, సాంకేతిక నైపుణ్యం, విపత్తుల నిర్వహణ వంటి అంశాల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. హిరోషిమా నగరం విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు సాగిన ప్రయాణం ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందిస్తోందని, శాంతి, సహనం, మానవత్వం ద్వారా సమాజాలు అభివృద్ధి సాధించగలవని నిరూపించిందని తెలిపారు. తెలంగాణ, జపాన్ మధ్య విద్యార్థులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు పెరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్-మియోషి నగరాల మధ్య కొనసాగుతున్న సోదర నగర భాగస్వామ్యం ఇరు ప్రాంతాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశం కేవలం అధికారిక పర్యటనగా మాత్రమే కాకుండా తెలంగాణ-జపాన్ ప్రాంతాల మధ్య భవిష్యత్తు సహకారానికి బలమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల తరఫున జపాన్ ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ఇరు ప్రాంతాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహాచార్యులు, శాసనసభ సెక్రెటరీ శ్రీ రెండ్ల తిరుపతి గారు, జపాన్ ప్రతినిధుల బృందం సభ్యులు, శాసనసభ, శాసన మండలి ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
