ఖమ్మం, వెలుతురు, అక్టోబరు 12 : ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా.. భక్తిభావ తరంగాలు వెల్లివిరిసేలా.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యసన్నిధి ఖమ్మం గడ్డపై కొలువుదీరేందుకు తొలి అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి సోమవారం వేదమంత్రోచ్ఛారణలు, హోమాలు, పూజా కార్యక్రమాల నడుమ వైభవంగా భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, పోలీసు కమిషనర్ సునీల్ దత్ తదితరులు ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరవశింపజేశారు. ఖమ్మం ప్రాంతానికి శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను తీసుకురావడమే కాకుండా.. ధర్మం, భక్తి, మానవత్వం, సమైక్యతకు ప్రతీకగా నిలవనుంది. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ధర్మమార్గంలో పయనిస్తూ, పరస్పర ప్రేమాభిమానాలతో జీవించాలని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు.
