కరువు మండలాల జాబితాలో కరీంనగర్‌కు తీవ్ర అన్యాయం: బండి సంజయ్

కరువు మండలాల జాబితాలో కరీంనగర్‌కు తీవ్ర అన్యాయం: బండి సంజయ్

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 :  కరువు మండలాల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన అనేక మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కరువు మండలాల జాబితాను మొక్కుబడిగా ప్రకటించినట్లు కనిపిస్తోందని, ఎంపిక ప్రక్రియను పరిశీలిస్తే అశాస్త్రీయంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. 35 శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలు సైతం కరువు జాబితాలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పొలాలు బీళ్లుగా మారి, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచించారు. కరువు మండలాల గుర్తింపులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలకు ఒకే విధమైన ప్రమాణాలు పాటించారా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితులను ఏ ప్రాతిపదికన పరిశీలించారో వెల్లడించాలని కోరారు. కరువు మండలాల ఎంపికకు ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రమాణాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. కరువు జాబితాలో చోటు దక్కని మండలాల్లో పంట నష్టం, నేలలో తేమ శాతం, భూగర్భ జలాల పరిస్థితులను పరిశీలించారా? ఆయా ప్రాంతాల రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సగటు వర్షపాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతి మండలంలో నమోదైన వర్షపాతం లోటు, పంటల పరిస్థితిని విడివిడిగా అధ్యయనం చేయాలని సూచించారు. ఒక మండలంలో వర్షం కురిసినంత మాత్రాన పక్క మండలంలోనూ అదే పరిస్థితి ఉంటుందని భావించడం శాస్త్రీయ విధానం కాదని పేర్కొన్నారు. ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సర్వేలో మినహాయించిన గ్రామాలు, మండలాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, సమగ్రంగా పరిశీలించాలని కోరారు. అర్హత ఉన్న మండలాలు జాబితా నుంచి మినహాయించబడినట్లు తేలితే, నిబంధనలకు అనుగుణంగా వాటిని కరువు మండలాల జాబితాలో చేర్చాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని ఆయన స్పష్టం చేశారు. కరువు ప్రభావిత రైతులకు అర్హత మేరకు సహాయక చర్యలు అందించడంతోపాటు, పేదలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులు, పేదలకు అన్యాయం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.