ప్రత్యేక రైళ్లకు అనుమతి నిరాకరణ.. బస్సుల్లో ఢిల్లీకి వెళ్తాం : మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 : నవంబర్ 1న ఢిల్లీలో జరగనున్న ‘వోట్ బచావో, దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి భారీగా తరలివెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ఐదు రోజుల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే శాఖ తిరస్కరించిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. బస్సుల ద్వారా ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఎంపీ మల్లు రవి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్సు ప్రయాణం 30 గంటలకు పైగా ఉండనున్న నేపథ్యంలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ చైర్మన్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
