డీప్‌టెక్ ఆవిష్కరణలకు తెలంగాణలో అపార అవకాశాలు

డీప్‌టెక్ ఆవిష్కరణలకు తెలంగాణలో అపార అవకాశాలు

 

‎

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  డీప్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ వాటిని ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పులు తీసుకొచ్చే ఉత్పత్తులు, సేవలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

‎

‎బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బుధవారం నిర్వహించిన FICCI @100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పాల్గొన్న ఆయనకు FICCI చైర్మన్ వీవీఆర్ రాజు, FTCCI అధ్యక్షురాలు కేకే మహేశ్వరి, FICCI మాజీ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.

‎

‎ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. 2034-35 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలు రాష్ట్రానికి ప్రధాన బలమని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పాటు హిల్ట్ పాలసీ వంటి వినూత్న విధానాలు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.