శ్రీశైలం ఖాళీ.. వెంటాడుతున్న ఆందోళన
నాగర్ కర్నూల్, వెలుతురు, నవంబర్ 16 : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. పూర్తిస్థాయి 215.80 టీఎంసీల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ప్రస్తుతం 829.10 అడుగులకు పడిపోయింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 3.03 టీఎంసీల మేర నీటి నిల్వ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు సగటున 0.33 టీఎంసీల నీరు తగ్గుతోంది.
జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయానికి కొత్తగా నీరు చేరడం లేదు. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల తాగునీటి అవసరాలను వచ్చే ఏడాది జూలై వరకు తీర్చేలా అధికారులు నీటి వినియోగ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడం సవాలుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
